SAYINGS & TEACHINGS

“ పూజ్యశ్రీ మాస్టరుగారు ఆచరించి చూపినట్లు మనం గూడ మన గురుదేవులైన పూజ్యశ్రీ మాస్టరుగారిని గురించి యింకా యింకా తెలుసుకోవడానికి, ఆయన చెప్పిన వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి.  సామాన్యంగా మనము పూజ్యశ్రీ మాస్టరుగారి గురించి ఎంతో తెలుసనుకుంటాము. కానీ ఆలోచించిన కొద్దీ ఆయన గురించి ఎంతో తెలియదని తెలుస్తుంది. ”

“ నేను మాస్టరుగారు చెప్పినవిధంగా సత్సంగాలు చేస్తున్నాను, ఇన్ని సత్సంగాలు చేసాను. నన్ను వాడు గౌరవించడా?’ అని ఎప్పుడైనా అనిపించడము, అనడమూ జరిగిందనుకుందాం. దాని వెనకాలవున్న భావమేమిటో ఆలోచించుకోవాలి. అంటే మనం సత్సంగాలు చేస్తున్నామన్న అహంకారము, మనం గొప్పవాళ్ళమన్న గర్వము, మనలను యితరులు గౌరవించాలన్న కీర్తి కాంక్ష వున్నాయని అర్థం. మనలను నలుగురూ గౌరవించడము, మనలను కార్లలో త్రిప్పడము, ఎక్కడెక్కడికో సత్సంగాలకు తీసుకెళ్ళడము, విదేశాలకు తీసుకువెళ్ళడము, మనకు అనుచరులు లక్షల కొద్దీ వుండడమూ-ఇవేవీ మన ఉన్నతికి సరియైన కొలబద్దలు కావు. మనలోని బలహీనతలను గుర్తించి, వాటిని తొలగించుకోవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నాము అన్నదే పూజ్యశ్రీ మాస్టరుగారు చెప్పిన దానిని అమలు పరుస్తున్నామనడానికి నిదర్శనం. ఒక ప్రక్క ఆయన చెప్పినట్లు సత్సంగాలు మొ॥నవి చేసుకుంటూ, మరొకప్రక్క మనలోని బలహీనతలను తొలగించుకుంటూ పోతుండడమే పూజ్యశ్రీ మాస్టరుగారి అనుగ్రహానికి పాత్రులమవడానికి, అర్హత సంపాదించు కోవడానికి మార్గము. ”

‘శ్రద్ధ’ అనే పదానికి అర్థం – మమకారంతో గూడిన లేక ప్రేమతో గూడిన జాగ్రత్త లేక ఆసక్తి అని చెప్పుకోవచ్చు. శ్రద్ధ అనేది మనిషికి చాలా అవసరం. అటు ఆధ్యాత్మికోన్నతికి గాని, ఇటు ఐహిక శ్రేయస్సుకుగానీ శ్రద్ధ లేనిదే ఉపయోగం వుండదు. అందుకే పెద్దలు ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం’ అన్నారు.

“ ‘కృతజ్ఞతకు మరోపేరు సాయి’ అని పూజ్యశ్రీ మాస్టరుగారన్నారు. అలాగే కృతజ్ఞతకు మరోపేరు పూజ్యశ్రీ మాస్టరుగారు గూడా. శ్రీ సాయినాథుడు తమకు ప్రసాదించిన ఆధ్యాత్మికానుభవానికి కృతజ్ఞతగా ఆయన తమ జీవితాన్నే సాయి సేవకు అంకితం చేసారు.

పూజ్యశ్రీ మాస్టరుగారు చేసినట్టు మనం గూడ సేవ చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దయ, సహనము, పరోపకారము, సద్గ్రంథ పఠనము, శ్రవణ, మనన, నిధి ధ్యాసనము, సత్సంగము, భజన, సద్గురు సమాగమము, మహాత్ముల దర్శనము సాధ్యమైనంతవరకూ వీటన్నింటినీ చేయడానికి ప్రయత్నించాలి.

“ పూజ్య శ్రీ మాస్టరుగారు చెప్పిన వాటిని మననం చేసుకుంటూ, మన ఆలోచనలను, ప్రవర్తనను మలచుకుంటూ పోతుంటే మనకు సాధన  సులభతరమవుతుందని వేరే చెప్పుకోనవసరం లేదు.

“ పూజ్యశ్రీ మాస్టరుగారు ఏమేమి చేసారో, ఏమేమి చెప్పారో, ఎంత ధర్మబద్ధంగా జీవించారో ఆయన గురించి తెలిసిన మనందరికీ తెలుసు. ఆయన కోరుకున్న విధంగా మన జీవితాలను మలచుకోవడమే మన కర్తవ్యము. కనుక మనలో ఆయన తొలగించుకోమన్న గుణాలు వున్నాయో లేదో నిష్కర్షగా గమనించుకోవాలి. ఆచరించడానికి ప్రయత్నించాలి. నిష్కర్షగా గమనించుకోకుండానే మనలో అటువంటి తొలగించుకోవలసిన గుణాలేవీ లేవని అనుకుంటే ఇతరులకు ఏమీ నష్టం లేదు. ‘చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు’ అన్న సామెత లోకంలో వుంది. కానీ మనకు చెప్పేవాళ్ళు వున్నా చెడిపోయిన వాళ్ళమవుతాము. ఇంతటి అదృష్టాన్ని చేజేతులా జారవిడచుకున్న వాళ్ళమవుతాము. ఎన్నో జన్మలు నష్టపోతాము.